స్ఫూర్తిదాయకమైన సేవలు ప్రశంసనీయం
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కితాబు,మాజీ ఎంపీ మాగంటి బాబు
ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి హెల్మెట్ల పంపిణీ
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : తాము అభిమానించే హీరోల సందేశాత్మక చిత్రాలతో వారి ఫ్యాన్స్ గా మారే యువత అదే స్ఫూర్తితో సమాజానికి సందేశం ఇచ్చేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి,మాజీ ఎంపీ మాగంటి బాబు,ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు.ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో బుధవారం ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి స్ఫూర్తినిచ్చేలా ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎంపీ మాగంటి బాబు, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఏలూరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన వంద హెల్మెట్లను వారు ద్విచక్ర వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని హితవు పలికారు. ఇటీవల జరుగుతున్న ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతోమంది మృతి చెందుతున్నారని, ఈ సంఘటనలు ఆయా కుటుంబాలకు గర్భశోకం మిగులుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభిమానించే హీరోల సందేశాత్మక చిత్రాలను చూసి స్ఫూర్తి పొందే అభిమానులు సమాజానికి సందేశమిస్తూ ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికి మంచి సందేశాలు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని, మన రాష్ట్రంలో ఇది లేకపోయినప్పటికీ హైదరాబాద్ వెళ్లే యువత వాటికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిపై యువత స్పందించి సమాజానికి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందిస్తే మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రహదారి భద్రతతో జీవితాలకు రక్షణ కలుగుతుందని, మరీ ముఖ్యంగా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకు రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఏఏంసి మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, అల్లు అర్జున్ ఏలూరు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్, వైస్ ప్రెసిడెంట్ అఖిల్, సెక్రటరీ మణికంఠ, జనరల్ సెక్రెటరీ యోగి,ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ సురేష్, ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బాలు తదితరులు పాల్గొన్నారు.


