NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేషన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహించే డీలర్లను తొలగిస్తాం

1 min read

హెచ్చరిక చేసిన  జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్:ఎం.జె అభిషేక్ గౌడ్

ప్రజల సంతృప్తి స్థాయిని ఐవి ఆర్ఎస్ విధానం ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటుంది

రేషన్ పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రేషన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహించే డీలర్లను తొలగిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా:ఎం.జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు.   ఇటీవల   ఐవి ఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ మరియు రేషన్ పంపిణీ తదితర విషయాలలో తక్కువ పనితీరు కనబరిచిన 45 మంది చౌకధరల దుకాణాల  డీలర్లతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో డీలర్ల పనితీరును  జేసీ సమీక్షించారు.   ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ప్రజలకు  అందిస్తున్న సేవలపై ప్రజల సంతృప్తి స్థాయికి ఐవిఆర్ ఎస్ విధానం ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటున్నదన్నారు.  ప్రజలకు  రేషన్ పంపిణీ ని సక్రమంగా చేయాలనీ, రేషన్ కోసం వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి, ప్రవర్తించాలన్నారు.  రేషన్ దుకాణాల ద్వారా డీలర్ల సేవలపై  క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేస్తారన్నారు. జిలాల్లోని 45 రేషన్ డీలర్లు సేవలలో IVRS ఫీడ్‌బ్యాక్‌లో వెనుకబడి ఉన్నారని, సదరు డీలర్లు వారి పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. నాణ్యమైన నిల్వ మరియు పరిశుభ్రత, సరుకులు పాడవకుండా నాణ్యమైన నిల్వ సౌకర్యాలతో, మంచి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలని, రేషన్ షాపు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రేషన్ పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని,  ప్రవర్తనా లోపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వకూడదన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేసి, ఐవిఆర్ ఎస్ ఫీడ్‌బ్యాక్‌లో మెరుగుదల సాధించేందుకు జాయింట్ కలెక్టర్  డీలర్లకు పలు కఠిన సూచనలు జారీ చేశారు. తక్కువ పనితీరు కనబరిచిన  45 రేషన్ దుకాణాలను సీఎస్‌డీటీలు   వెంటనే వ్యక్తిగతంగా సందర్శించి, పైన తెలిపిన ఆదేశాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో క్షేత్రస్థాయిలో తనిఖీ  చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని జాయింట్ కలెక్టర్  ఆదేశించారు.సమావేశంలో ఏలూరు జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్, , పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి,., ఏలూరు సహాయ పౌర సరఫరాల అధికారి  మరియు జిల్లాలోని సీఎస్‌డీటీలు  పాల్గొన్నారు.

About Author