మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్ బదిలీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: గురువారం కర్నూలు మున్సిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవో నెంబర్ 414 జారీ చేసింది. ఆయన స్థానంలో చల్లా ఓబులేసును నియమించింది.కాగా గతేడాది జులై 11న కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.విశ్వనాథ్, 9 నెలల పాటు నగరానికి సేవలు అందించారు. నగర ప్రజల ఆశలకు, ఆకాంక్షలను అనుగుణంగా పనితీరు కనబరిచారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాలతో అనతి కాలంలోనే నగర ప్రజల్లో మెప్పు పొందారు.నగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేటు స్థలాల్లో పదుల సంఖ్యలో జెసిబిలతో పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టడంతో పాటు గుత్తేదారులకు ఒకేసారి రూ. 18 కోట్లు, మరోసారి రూ.11 కోట్ల బిల్లులను చెల్లింపులు చేశారు. బుధవారపేట మెడికల్ కాలేజీ వద్ద మలుపు విస్తరణ వంటి దశాబ్దాల సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర స్థాయి వార్తల్లో నిలిచారు. దామోదరం సంజీవయ్య కూడలి నుంచి ఎస్ఎస్ గార్డెన్స్ వరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.30 కోట్లతో రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు.పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు క్రమశిక్షణలు తీసుకుని కొన్ని విభాగాలను ప్రక్షాళన చేశారు. అవినీతి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. తొలిసారి ఆర్వో, శానిటేషన్ ఇన్స్పెక్టర్లుగా మహిళలకు అవకాశం కల్పించారు. మున్సిపల్ కార్యాలయంలో ఫీడింగ్ రూం, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘కర్నూలుకు హరితహారం’ పేరుతో విడతల వారీగా 30 వేల మొక్కలు నాటించి గ్రీన్ సిటీకి నాంది పలికారు. అందులో ఒకేసారి 6 వేల మొక్కలను సచివాలయాల్లో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. గార్బేజ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చెత్త వేయడంపై కఠిన చర్యలు చేపట్టారు. రాత్రివేళల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ప్రతి వీధి గోడలపై సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంచి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచారు. యువత, విద్యార్థుల సహకారంతో విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.వచ్చిన కొత్తలో సంతోష్ నగర్ వద్ద పైప్లాన్ లీకేజీ సమస్యను అత్యవసరంగా పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా పక్కా ప్రణాళిక ద్వారా తాగునీటి సరఫరా చేశారు. నిపుణుల సహాయంతో చాకచక్యంగా లీకేజీలను సమర్థవంతంగా నివారించారు.

