NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా  పూర్వారాధన మహోత్సవం

1 min read

సింహ వాహనంపై శ్రీ ప్రహ్లాద రాయలు

 శ్రీరంగం ఆలయ పట్టు వస్త్రాలు

మంత్రాలయం , న్యూస్​ నేడు :   మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354 వ సప్త ఆరాధనోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఆదివారం పూర్వారాధన వేడుకలు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాద రాయలు సింహ వాహనంపై  భక్తులకు  దర్శనమిచ్చారు.  పూర్వారాధన ఉత్సవ వేడుకలు పురస్కరించుకుని   శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి , విశేష పంచామృతాభిషేకం , తులసి అర్చన, ఉత్సవ రాయల పాద పూజ తో పాటు వివిధ అభిషేక పూజలు నిర్వహించారు. బృందావనానికి పట్టు వస్త్రాలు, స్వర్ణ కవచాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి ప్రత్యేక హారతి ఇచ్చారు.సంస్థాన పూజల్లో భాగంగా  శ్రీ మూల రామ, దిగ్విజయ రామ, జయరామ, నరసింహ స్వామి, వేద వ్యాసుల పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ముందుగా  గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను దర్శించుకుని,శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. ఆరాధన ఉత్సవాల సందర్భంగా శ్రీ ప్రహ్లాద రాయలను సింహ వాహనంపై ఉంచి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ ఘనంగా ఊరేగించారు. అనంతరం కొయ్య, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలపై ఊరేగించారు.  ఉత్సవ మూర్తికి ఉయ్యాల సేవ చేసి హారతి ఇచ్చారు.

మూల బృందావనానికి శ్రీరంగం ఆలయ పట్టు వస్త్రాలు సమర్పణ :

 శ్రీ రాఘవేంద్రస్వామి 354వ సప్త ఆరాధనోత్సవాల సందర్భంగా  తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం ఆలయ  అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకు ముందు మఠం అధికారులు శ్రీ రంగం క్షేత్ర ఆలయ అధికారులు, అర్చకులకు మేళ తాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారికి వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ మఠంలో వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారికి వస్త్రాలు సమర్పించారు.  శ్రీ మఠంలో శ్రీ రంగక్షేత్ర ఆలయ అర్చకులను పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఘనంగా ఆహ్వానించి  పట్టు వస్త్రాలను స్వీకరించి శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి సమర్పించి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు.  ఊంజల సేవా మండపంలో శ్రీరంగం ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను  ఊయల ఉంచి పూజలు చేశారు. అనంతరం శ్రీ రంగక్షేత్ర ఆలయ అర్చకులను  పీఠాధిపతులు  శేషవస్ర్తం, పరిమళ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.కార్యక్రమంలో పండిత కేసరి, మహోపాధ్యాయ రాజా ఎస్ గిరియాచార్యులు, ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహయ మేనేజర్ ఐపి నరసింహ మూర్తి, ప్రిన్సిపాల్ వాదిరాజాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, బిందుమాధవచార్, కుర్డీ జయతీర్థాచార్, పూజారి వ్యాసరాజ్ స్వామి,  తదితర మఠం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

About Author