హెల్మెట్.. ప్రాణాలే కాదు ఇంకా చాలా కాపాడుతుంది!
1 min read

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి విరిగిన దవడ ఎముక
హెల్మెట్ పెట్టుకుని ఉంటే అలా జరిగేది కాదు
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యుల వెల్లడి
హైదరాబాద్, న్యూస్ నేడు : ఎవరైనా సరే ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసుల నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అయినా చాలామంది ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. చాలా సందర్భాల్లో తలకు తీవ్ర గాయాలవుతాయి. అప్పుడు ప్రధానంగా లోపలున్న మెదడు దెబ్బతింటుంది. మెదడులో అంతర్గత రక్తస్రావం లేదా కొన్నిసార్లు మరింత తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. మరికొన్ని సందర్భాలలో వేరే గాయాలు అవుతాయి. ఇలాగే నగరంలోని ఒక వ్యకి సంబంధించిన కేసు వివరాలను నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంవీఎన్ సురేష్ తెలిపారు. ‘‘నగరంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు హెల్మెట్ పెట్టుకోలేదు. దానివల్ల అతడి దవడ ఎముక విరిగిపోయింది. పూర్తిస్థాయి హెల్మెట్ పెట్టుకుని ఉంటే అతడికి ముఖం మీద గానీ, తలకు గానీ ఎలాంటి గాయాలూ అయ్యేవి కావు. కానీ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ప్రమాదానికి గురికావడంతో అతడి దవడ ఎముక విరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రికి రావడంతో అతడికి అత్యవసరమైన పరీక్షలన్నీ చేసిన తర్వాత.. శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. అయితే చేతులు, కాళ్ల ఎముకలు విరిగితే మామూలు కట్టు కట్టడం లేదా శస్త్రచికిత్స చేస్తే సరిపోతుంది. కానీ, దవడ ఎముక వల్ల అలా చేయడం కుదరదు. పైగా, దవడ ఎముక పైకి.. కిందకి కదలాల్సి ఉంటుంది. అందువల్ల ప్లాస్టిక్ సర్జన్ ఈ శస్త్రచికిత్సను చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు. హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనం నడిపితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ముఖం మీద అయ్యే గాయాలు చాలా సున్నితంగా ఉంటాయి. కొన్నిసందర్భాలలో తలకు గాయాలు అవ్వడం వల్ల అంతర్గత రక్తస్రావం సంభవించి, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మెదడు గాయపడితే దాన్ని సాధారణ స్థితికి తీసుకురావడ చాలా కష్టం అవుతుంది. రోడ్డు ప్రమాదాల్లో కింద పడేటప్పుడు వేగంగా పడతారు. అప్పుడు తల రోడ్డు లాంటి గట్టి ప్రదేశాలకు తగులుతుంది. దాంతో గాయతీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించాంటే తలకు పూర్తి రక్షణ కల్పించేలా మంచి నాణ్యమైన హెల్మెట్‌ను ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ధరించాలి. అది మాత్రమే తలకు, మెదడుకు, ముఖానికి పూర్తి రక్షణ కల్పించగలదు. అది చాలా రకాల ప్రమాదాలను నివారిస్తుంది’’ అని డాక్టర్ ఎంవీఎన్ సురేష్ సూచించారు.

