NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో రైతులకు సరిపడ ఎరువులను అందించాలి

1 min read

నానో ఎరువుల కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు

ఏలూరు మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా, వినతి పత్రం అందజేత

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.  రైతులకు ఎరువులను సక్రమంగా అందించాలని, బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మకాలను అరికట్టాలని, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని, రైతుల సమస్యలు తీరేంతవరకు పోరాడుతామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతుల కష్టాలను తీరుస్తామని, రైతులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత రైతులు పడుతున్న కష్టాలను ఇబ్బందులను తొలగించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడంలేదని విమర్శించారు.  రాష్ట్రంలోని రైతులు ఎండనక,వాననక ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు పడుతున్నారని,పెద్ద వయసు కలిగిన రైతులు క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులు, కర్రలు, గొడుగులు, క్యూ లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎరువుల కొరత వలన అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎరువులను సరిపడా అందించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అన్ని ఎమ్మార్వో కార్యాలయాలు వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు ఎరువులు సరిపడా ఉన్నాయని చెబుతున్నా రాష్ట్రంలోని రైతులు క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్న విషయం అధికారులు దృష్టికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలకు ఇప్పుడు చేస్తున్న పాలనకు పొంతన లేదని విమర్శించారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుండి అధికారులు అందరూ రైతులకు ఎరువుల కొరత లేదని అబద్ధాలను చెబుతున్నారని క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటూ రైతులకు యూరియా, డిఏపి అందుబాటులో లేదని తెలిపారు. అనంతరం మండల తహసీల్దార్ గాయత్రికి వినతి పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, కొండేటి రాంబాబు, కొండేటి బేబీ, ఎంఏ హకీం, ఏరియా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, తమ్మిశెట్టి రమణయ్య, దాసిపల్లి ఆదినారాయణ, గుంజే శ్రీను, దాచేపల్లి ఎర్రయ్య, వెదురుపర్తి శారద,షరీఫ్,ముదపాక ధనలక్ష్మి, ముదపాక సత్యనారాయణ,తోట సురేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author