భక్తులందరికీ ప్రశాంత వాతవరణంలో మల్లన్న దర్శనం
1 min read

భక్తుల రద్దీకి తగ్గట్లు సమగ్ర సదుపాయాలు
ఫిబ్రవరి 13 నుండి16 తేదీల్లో టోల్గేట్ రుసుము మినహాయింపు
24 గంటల ప్రయాణ రాకపోకలకు అనుమతి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
శ్రీశైలం/నంద్యాల న్యూస్ నేడు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి, భక్తులు ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. గురువారం దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్తో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 2,59,050 మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని తెలిపారు. నిన్న ఒక్కరోజే 69 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగా, బుధవారం రాత్రి శివస్వాములు అధిక సంఖ్యలో దర్శనానికి హాజరయ్యారని చెప్పారు. నడకదారిన కైలాస మార్గం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారని వివరించారు. రానున్న రెండు రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు జారీ చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పాతాళగంగ వద్ద పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు స్నాన ఘట్టాల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 75 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడించారు.భక్తుల క్యూలైన్లలో తాగునీటి సదుపాయంతో పాటు చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఒక్కరోజే 71 వేల మంది భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా భక్తులు మరింత సౌకర్యవంతంగా, ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు, భద్రతా ఏర్పాట్లకు భక్తులు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

