8న కేంద్ర విద్యుత్ బిల్లు,విత్తన బిల్లు ప్రతులను దగ్ధం చేయండి
1 min read

రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు
ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
కట్టా భాస్కర్ రావు,కె.శ్రీనివాస్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బిల్లు 2025, విత్తన బిల్లు 2025 ఇవి రెండూ రైతాంగానికి తీవ్రం నష్టం కలిగిస్తాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కట్టా భాస్కరరావు, కె.శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు అన్నే భవనంలో వారు మాట్లాడుతూ ఈనెల 8న విద్యుత్ బిల్లు, విత్తన బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామాలలో కదిలి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.విద్యుత్ బిల్లు 2025 ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రైవేటుపరం అవుతాయన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉండదన్నారు. దళితులు, గిరిజనులు, వివిధ సామాజిక తరగతులు, పేదలు బలహీన వర్గాలకు ఇచ్చే విద్యుత్ రాయితీ, చిన్న చిన్న పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్తు రాయితీ ఉండదన్నారు. దానితో పాటుగా గృహ వినియోగదారులపై ఇప్పటికి ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా మరింత భారం పడుతుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం విద్యుత్తు రాష్ట్రాల జాబితాలో ఉన్నదని, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విత్తన బిల్లు 2025 పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ విత్తన కంపెనీల ప్రయోజనాల కొరకే ఉపయోగపడుతుందన్నారు. స్వదేశీ, విదేశీ విత్తన కంపెనీల యొక్క లాభాలు, వాటి రక్షణ కొరకు మాత్రమే ఈ బిల్లు ఉద్దేశించబడిందని చెప్పారు. నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఎలాంటి పరిహారం చెల్లించే బాధ్యత విత్తన కంపెనీలకు ఉండదని, దీని వలన రైతాంగం నష్టపోతారని మరింత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రకంగా ఇది పూర్తిగా రైతులకు వ్యతిరేకమైన, విత్తన కంపెనీలకు అనుకూలమైన చట్టం అని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉన్నదని, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విత్తన బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు. రైతు వ్యతిరేక రైతు వ్యతిరేక,ప్రజావ్యతిరేక కేంద్ర విద్యుత్ బిల్లు,విత్తన బిల్లులను అందరూ వ్యతిరేకించాలని కోరారు.

