రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు తీరని ద్రోహం
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకుని సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు ఘోరమైన ద్రోహం చేశారని పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కంగాటి శ్రీదేవమ్మ తీవ్రంగా విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న ఎత్తిపోతల పథకం పనులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంగళవారం పత్తికొండలోని తన స్వగృహంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యేమాట్లాడుతూ, రాయలసీమ రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో ఈ పథకాన్ని ప్రారంభించి, 80 శాతం కంటే ఎక్కువ పనులు పూర్తి చేసిందని తెలిపారు. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయ కక్షతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేసి, రైతుల ఆశలను నీరుగార్చిందని, ఇది సీమ ప్రజలపై చేసిన ఘోరమైన అన్యాయమని ఆమె మండిపడ్డారు.రాయలసీమకు నీళ్లు రావడం చంద్రబాబుకు ఇష్టం లేకనే ఈ పథకాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.రాయలసీమ హక్కుల కోసం వైఎస్ఆర్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని, ప్రజలు, రైతులు ఐక్యంగా ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్రకమిటీనాయకులు,ఎంపీపీ, మండల కన్వీనర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కమిటీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

