NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టు బన్ని ఉత్సవాలను  శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి

హొళగుంద న్యూస్ నేడు : దేవరగట్టు బన్ని ఉత్సవాలను  శాంతియుత వాతావరణంలో జరిగేలా గ్రామస్థులు సహకరించాలని, ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని  జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి పేర్కొన్నారు. శుక్రవారం దేవరగట్టు గ్రామంలో బన్ని ఉత్సవాల సందర్భంగా  నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి  అధికారులు, గ్రామ పెద్దలతో  జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ –దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు  రెండు లక్షల మందికి పైగా  జనం వచ్చే అవకాశం ఉన్నందున  మౌలిక వసతుల ఏర్పాటు అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉత్సవాలకు రెండు రోజులు ముందే పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్లపై గుంతలు (పాట్‌హోల్స్) లేకుండా  మరమ్మతులు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.గత సంవత్సరం కంటే అత్యధికంగా లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా సమయంలో ఏవైనా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా, సమీపంలోనే మెడికల్ క్యాంప్‌ ఏర్పాటుచేయాలని,  కాలిన గాయాలు,  పాముకాటు తో పాటు అవసరమైన మందులు,మందులు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల కోసం సకాలంలో స్పందించే విధంగా అంబులెన్స్‌లు సిగ్నల్ పాయింట్ల వద్ద మోహరించాలని సూచించారు.104, 108 వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, హోళగుంద పీహెచ్ సీ లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు..ఫిజియో థెరపిస్ట్ ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు..తాగునీటి సదుపాయం, పారిశుద్ధ్య చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.సాంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రతి ఒక్కరూ ఆనందభరితమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు.సాంప్రదాయాలను గౌరవిస్తూనే  పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి : జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బన్నీ ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా, పండుగ ప్రశాంత వాతావరణంలో  నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గ్రామ ప్రజలకు సూచించారు. గతంలో బన్నీ ఉత్సవాల సమయంలో చెట్టు పైన అధిక సంఖ్యలో భక్తులు ఎక్కడంతో ప్రమాదవశాత్తుగా నలుగురు మరణించారని,  ఈ సారి ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులకు సూచించారు..వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అలాగే పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. కమ్యూనికేషన్ బాగా ఉండేందుకు, నెట్వర్క్ సమస్యలు తలెత్తకుండా తాత్కాలిక మొబైల్ టవర్ ఏర్పాటు చేయాలని అధికారులకు  సూచించారు. విద్యుత్ షాక్ వంటి ఘటనలు జరుగకుండా  ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మద్యం వినియోగాన్ని కట్టడి చేయడంలో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.. సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ, పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ గ్రామస్తులను కోరారు.

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ  దసరా పండుగ రోజు రాత్రి బన్నీ ఉత్సవాలు జరుగుతాయని, ఇందులో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఉత్సవాలు జరిగే తీరును గురించి వివరించారు. సమావేశంలో   పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్, పత్తికొండ డి.ఎస్.పి వెంకట్రామయ్య, ఆర్ అండ్ బి ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి,  ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్,  దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి ,  డిపిఓ భాస్కర్, డి ఏం హెచ్ ఓ శాంతికళ,ఆలూరు – హోలగుంద  తహసీల్దారులు, ఎంపి డిఓ లు, ఫారెస్ట్ ,ట్రాన్స్కో , పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఇంజనీర్లు,  ఎక్సైజ్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About Author