అభివృద్ధి పేరుతో ఆదివాసులను శరణార్థులుగా మార్చకూడదు
1 min read

డా. జె. పూర్ణచంద్రరావు
- రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ని కలిసిన ప్రతినిధి బృందం
విజయవాడ, న్యూస్ నేడు: రాష్ట్రంలో ఆదివాసుల హక్కులు రక్షించడంతో పాటు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ నిబంధనలు సమర్థంగా అమలు చేయాలని కోరుతూ జాతీయ ఆదివాసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ని కలిశారు. అనంతరం రాజ్ భవన్ మీడియా పాయింట్ వద్ద మీడియాతో డా. జె. పూర్ణచంద్రరావు, ఐపీఎస్ (విరమణ), మాజీ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల వలన ఆదివాసులు తమ ఇళ్లు, జీవనాధారాలను కోల్పోయి తమ స్వంత భూమిలోనే శరణార్థులుగా మారే పరిస్థితి తీసుకు రావొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. పి.వి. రమేష్, ఐఏఎస్ (విరమణ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి; మాజీ ఎమ్మెల్యేలు శ్రీ లకే రాజారావు, శ్రీ చందా లింగయ్య దొర; శ్రీ లక్ష్మణ మూర్తి; విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పలువురు ఆదివాసి నాయకులు పాల్గొన్నారు. పోలవరం వంటి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను సాధారణంగా దేశ అభివృద్ధి, వ్యవసాయ సమృద్ధికి ప్రతీకలుగా చూపుతున్నారని డా. పూర్ణచంద్రరావు తెలిపారు. ఇటువంటి ప్రాజెక్టులు విస్తారమైన సాగు ప్రాంతాలకు నీటిని అందించి వ్యవసాయాభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పినా, గోదావరి పరివాహక ప్రాంతంలోని అడవులు, నదీ తీరాల్లో తరతరాలుగా నివసిస్తున్న వేలాది ఆదివాసి కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ భూములను మైదాన వాసులు అన్యాక్రాంతం చేస్తున్న కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలచేయడం లేదని , ఏజెన్సీ ప్రాంతాలలో టీచర్ హెల్త్ వర్కర్ కానిస్టేబుల్ క్యాడర్ పోస్ట్ లను తిరిగి ఏజెన్సీ ఆదివాసులకు ఇవ్వాలని గవర్నర్ ఆఫీస్ లో ట్రైబల్ సెల్ ఏర్పాటు జేయాలని గవర్నర్ కు ఏజెన్సీ ప్రాంత పాలన కలెక్టర్ల ద్వారా నేరుగా చేయాలని బ్రిటిష్ కాలం నుంచి పాలన గవర్నర్ జనరల్ చేతిలో ఉందని రాజ్యాంగ మే చెపుతుందని అన్నారు. ఆదివాసి కుటుంబాల పునరావాసానికి కేవలం నగదు పరిహారం సరిపోదని, వ్యవసాయం మరియు అడవులపై ఆధారపడి జీవించే వారికి “భూమికి భూమి” (ల్యాండ్ ఫర్ ల్యాండ్) విధానం అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు కమాండ్ ఏరియాలోనే సాగుభూమిని కేటాయిస్తే నిర్వాసితులు అభివృద్ధి ఫలితాల్లో భాగస్వాములు అవుతారని చెప్పారు.

