అత్యవసర శస్త్రచికిత్సతో రోజుకూలీ ప్రాణాలు నిలబెట్టిన వైద్యులు
1 min read

డ్రిల్లింగ్ పనిచేస్తుండగా మోచేతి పైభాగంలో తీవ్ర గాయం
ప్రధాన రక్తనాళం తెగిపోయి తీవ్రస్థాయిలో రక్తస్రావం
బీపీ పడిపోయి ప్రాణాపాయ స్థితిలో సీతమ్మధార కిమ్స్‌కు రోగి
రక్తనాళానికి బైపాస్ శస్త్రచికిత్సతో నిలిచిన ప్రాణాలు
విశాఖపట్నం, న్యూస్ నేడు : అతడు ఓ రోజుకూలీ. విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతంలో ఎక్కడో డ్రిల్లింగ్ పనిచేస్తుండగా అది పొరపాటున వెనక్కి వచ్చి, అతడి కుడి మోచేతి పైభాగంలో బలంగా గుచ్చుకుని లోపలకు చొచ్చుకెళ్లింది. దాంతో విపరీతమైన రక్తస్రావం అవుతున్నస్థితిలో అతడిని సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అతడికి సరైన సమయానికి సరైన శస్త్రచికిత్స చేసి, అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ సీతమ్మధార ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ వాస్క్యులర్ ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ భరత్ అరుణ్ తెలిపారు. ‘‘25 సంవత్సరాల వయసున్న ఆ యువకుడిని ముందుగా ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లారు. అప్పటికి అసలు అతడి బీపీ రికార్డు కావట్లేదు. దాంతో వెంటనే గాయానికి డ్రసింగ్ చేయడంతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, ఇతర మందులు పెట్టి అతడి బీపీని కొంతమేర పునరుద్ధరించారు. అందులోనూ వాస్క్యులర్ సర్జరీలు ఆలస్యం అయ్యేకొద్దీ రక్తసరఫరా లేక ఆయా భాగాలు పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటిని తొలగించడం తప్ప వేరే మార్గం ఉండదు. అందుబాటులో వాస్క్యులర్ సర్జన్, తగిన సదుపాయాలు ఉండడం చాలా ముఖ్యం. ఇవన్నీ ఉండడం వల్లనే ఈ కేసులో అతడి చేయి పునరుద్ధరించగలిగాం’’ అని డాక్టర్ భరత్ అరుణ్ వివరించారు.

