పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దు
1 min read

రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి
నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేయాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దని, నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మాణం చేయాలని, అందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మంగళవారం పెదవేగిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆయిల్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రములో రోజురోజుకీ ఆయిల్ పామ్ విస్తీర్ణం పెరుగుతోందన్నారు., దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఉందన్నారు. సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన తగదన్నారు. ఒకవైపు ప్రైవేట్ ఫ్యాక్టరీలు లాభాలు గడించి మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేస్తుంటే పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు.పాత మిషనరీతో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారం స్థానంలో కొత్త కర్మాగారం నిర్మించడానికి బదులు ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే చర్యలతో ఆయిల్ పామ్ రైతులకు అన్యాయం చేయడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయిల్ రికవరీ శాతం ఈ సంవత్సరం కూడా అశ్వరావుపేటలోని తెలంగాణ ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో మన గెలలు మిల్లింగ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా పెదవేగిలోని పాత ఆయిల్ ఫెడ్ కర్మాగారం స్థానంలో నూతన కర్మాగారం నిర్మించేందుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సహకార రంగంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలన్నారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మగారాన్ని ప్రైవేటీకరించే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గోళ్ళ అర్జునరావు,మెతుకు మెల్లి రాంబాబు,కూచిపూడి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

