NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

1,00,686 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలి

1 min read

జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి

జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్​ నేడు : జిల్లాలో ఉన్న 1,00,686 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి ఉల్లాస్ – అక్షరాంధ్ర” కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వయోజన విద్యా అధికారి చంద్రశేఖర్, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “ఉల్లాస్ – అక్షరాంధ్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.  జిల్లాలో ప్రస్తుతం 69 శాతం అక్షరాస్యత కలిగి ఉందన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు 1,00,686 మందిని లక్ష్యంగా నిర్ధారించగా, అందులో 25,686 మంది పురుషులు, 75,000 మంది మహిళలను గుర్తించామని తెలిపారు. వీరికి శిక్షణ అందించేందుకు 10,667 మంది వాలంటీర్లు గౌరవ వేతనం లేకుండానే ముందుకు రావడం అభినందనీయమన్నారు. కమ్యూనిటీ హాల్స్, గ్రామ సచివాలయాలు, పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద 25,686 మంది వేతనదారులు, డిఆర్డిఎ పరిధిలో 50,000 మంది మహిళలు, మెప్మా పరిధిలోని 25,000 మంది పొదుపు సంఘాల మహిళలను గుర్తించామని పేర్కొన్నారు. నిరక్షరాస్యులను విద్యావంతులుగా మార్చగలిగితే కుటుంబమంతా అక్షరాస్యంగా మారే అవకాశం ఉందన్నారు. అలాగే స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ వివరాలను డిప్యూటీ ఎంపిడిఓలు, పంచాయతీ సెక్రటరీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

About Author