NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుంద మండలంలో ఈద్-ఉల్-ఫితర్ మహోత్సవం ఘనంగా నిర్వహణ

1 min read

– ఈద్గాలో పురుషులతో పాటు మహిళల విశేష భాగస్వామ్యం

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం పరిధిలోని హోళగుంద గ్రామంలో పవిత్రమైన ఈద్-ఉల్-ఫితర్ పండుగను అపూర్వమైన భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలోని ఈద్గా మైదానం సందడి వాతావరణంతో కళకళలాడింది. ముస్లిం సోదరులు సంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ఈద్గాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం స్త్రీలు కూడా విశేషంగా పాల్గొని పండుగకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు అందరూ కలిసి ఈ పవిత్ర పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.ఈద్గా మైదానంలో ప్రత్యేక ఈద్ నమాజ్ ఘనంగా నిర్వహించబడింది. నమాజ్ అనంతరం అందరూ పరస్పరం కౌగిలించుకుని ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజంలో ఐక్యతను ప్రతిబింబించారు.ఈ సందర్భంగా మౌలానా హబీబుల్లా జామాయి గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం (రోజా) పాటించడం ద్వారా మనిషి జీవన విధానంలో వచ్చే మార్పులను విపులంగా వివరించారు. ఉపవాసం అనేది కేవలం ఆకలి, దాహాన్ని నియంత్రించడం మాత్రమే కాకుండా, మనసు, మాట, ప్రవర్తనలను శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక సాధన అని పేర్కొన్నారు.రోజా పాటించడం ద్వారా మనిషిలో సహనం, నియంత్రణ, క్రమశిక్షణ పెరుగుతాయని, చెడు అలవాట్లను విడిచి మంచి మార్గాన్ని అనుసరించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పారు. అల్లాహ్ పట్ల భక్తి (తక్వా) పెంపొందించడంలో ఉపవాసం ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు.అదేవిధంగా, ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మౌలానా  వివరించారు. ఉపవాసం శరీరానికి విశ్రాంతిని ఇచ్చి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని, మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామంలోని ముస్లిం యువకులు ఈద్గా మైదానాన్ని శుభ్రంగా నిర్వహించడం, పండుగ ఏర్పాట్లు చేయడం విశేషంగా నిలిచింది. అందరూ కలిసి కట్టుగా పనిచేయడం గ్రామ ఐక్యతను చాటిచెప్పింది.చివరగా, “అల్లాహ్ తాలా మన అందరి ఉపవాసాలను, ప్రార్థనలను స్వీకరించి, మన పాపాలను క్షమించి, ప్రతి ఒక్కరికీ జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించాలి” అని మౌలానా హబీబుల్లా జామాయి  ప్రార్థించారు. ఈద్ పండుగ సందర్భంగా హోళగుంద  గ్రామం ఆనందోత్సాహాలతో కళకళలాడుతూ, మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది ముస్లింలు స్త్రీలు పిల్లలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.

About Author