ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహిస్తుంది
1 min read

పరిశ్రమల స్థాపినే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఔత్సాహికులైన యువ పారిశ్రామిక వేత్తలను అన్నివిధాలా ప్రోత్సహిస్తూ, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎదురైన సవాళ్ళన్నీ అధిగమించి సమున్నత లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం కీలకమైన అడుగు వేసిందని ఆయన వెల్లడించారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద ఏపి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0లో భాగంగా 2.2 ఎకరాల్లో సుమారు 14కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటుచేయనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ – పారిశ్రామిక వాడ నిర్మాణ పనులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పార్కులను ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు హేలాపురిలో కూడా దీని ఏర్పాటుకు బీజం పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈకి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు స్వశక్తితో స్వయం సమృద్ది సాధించేందుకు అవసరమైన అవకాశాలను కూటమి ప్రభుత్వం పుష్కలంగా కల్పిస్తోందని చెప్పారు. వాటన్నింటినీ ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా హేలాపురి నగరంలోని నడిబొడ్డులో పార్క్ ఏర్పాటుకు అనువైన స్థలం లభించడం అదృష్టమన్న ఆయన,,, ఇక్కడ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశించిన స్థాయిలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు రవాణా సౌకర్యం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, ఏపిఈపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. సాల్మన్‌రాజు, ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, తహశీల్దార్ గాయత్రీ దేవి, మరియు వివిధ హోదాలలో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


