100 రోజుల కార్యాచరణతో భూగర్భ జలాల పెంపుదలపై దృష్టి
1 min read

నీటి ఎద్దడి నివారణకు జలధార–జలహారతి కీలకం
రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్
నంద్యాల, న్యూస్ నేడు: రాష్ట్రంలో నీటి భద్రతను బలోపేతం చేయడంతో పాటు భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార–జలహారతి” కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామంలో నిర్వహించిన “జలధార – నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికగా కొనసాగుతుందని తెలిపారు. చెరువులు నింపడం, ఫీడర్ ఛానల్స్ మరియు వాగుల డీసిల్టింగ్ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచాలని సూచించారు.ముఖ్యమంత్రి ప్రతిపాదించిన “3 మీటర్లు – 8 మీటర్ల కాన్సెప్ట్” ప్రకారం, వర్షాకాలం అనంతరం భూగర్భ జలాల మట్టం 3 మీటర్లకు పైగా ఉండేలా, ఎండాకాలంలో 8 మీటర్ల కంటే దిగువకు పడిపోకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో నీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.

