ప్రభుత్వ కొనసాగింపుతో ఎపి నెం.1 కావడం గ్యారంటీ
1 min read

మోడీజీ 3సార్లు ప్రధాని కాబట్టే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
జిఎస్టీ సంస్కరణలతో రాష్ట్రప్రజలకు రూ.8వేల కోట్ల లబ్ధి
ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాలా ప్రధాని మోడీ సహకారం
డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ తో ఎపిలో అభివృద్ధి పరుగులు
కర్నూలు సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభలో మంత్రి లోకేష్
కర్నూలు , న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ అన్నా, ఇక్కడి ప్రజలు అన్నా ప్రధాని మోడీజీకి అపారమైన ప్రేమ. 16నెలల్లో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చారు, మనం అడిగిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నంబర్ 1 కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. గుజరాత్ లో ప్రభుత్వ కొనసాగింపు వల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ముఖ్యఅతిధిగా హాజరుకాగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు అనేది ముఖ్యం. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడుసార్లు ప్రధాని కావడం వల్లే ప్రపంచంలో 10నుంచి 4వ అతి పెద్ద ఎకానమీగా అభివృద్ధి చెందింది. సంక్షేమం – అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటివి, కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఏపీ అన్ని రంగాల్లో నంబర్ 1 కావడం గ్యారంటీ. పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ పవర్ ప్లేసెస్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళను గడగడ లాడించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారు, ముత్తుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు.
సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ తో దసరా, దీపావళి కలిపి ఒకేసారి వచ్చినట్లుగా ఉంది. అలాంటి సూపర్ పండుగను 140 కోట్ల ప్రజలకు అందించారు మన ప్రధాని నమో. పేద, మధ్య తరగతి ప్రజల పై పన్నుల భారం తగ్గించారు. ట్యాక్స్ తగ్గడం వలన ఒక్కో పేద, మధ్య తరగతి కుటుంబానికి ఏడాదికి 15 వేలు మిగులుతుంది. జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు దేశానికి లాభం జరుగుతుందని నమో అన్నారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం… ఇలా పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు పై జీఎస్టీ తగ్గించారు. జీఎస్టీ తగ్గడంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. పేద ప్రజల చిరునవ్వే మన నమో కి పండగ. నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత దేశానికి ప్రధానిగా నమో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు. 25 ఏళ్లు అధికారంలో ఉన్నా మన నమో మొదటి రోజు ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ అంతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. గుజరాత్ ను పవర్ ఫుల్ స్టేట్ గా మార్చారు. ఇప్పుడు భారత దేశాన్ని సూపర్ పవర్ గా మారుస్తున్నారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు. మన దేశ ప్రభుత్వాలు యూఎన్ దగ్గరకో, ఇతర దేశాల దగ్గరకో వెళ్లి సాయం కోరేవారు. మన నమో రూటే సెపరేటు. పెహల్గావ్ లో నమో కొట్టిన దెబ్బకి పాకిస్థాన్ దిమ్మ తిరిగిపోయింది. అమెరికా ట్యాక్సులు పెంచితే పెద్ద పెద్ద దేశాలు కూడా వణికిపోయాయి. నమో ఆత్మనిర్బర్ భారత్ వంటి కార్యక్రమాలతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. నమోకి దేశ ప్రజలు అంటే నమ్మకం.. మనకి నమో అంటే నమ్మకం. ఆ నమ్మకమే దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


