జీవితంలో..స్థిరపడాలి…
1 min read

తల్లిదండ్రులకు ఆసరా కావాలి
‘వెల్దుర్తి ’ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.గురువారం వెల్దుర్తి మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా విద్యా శాఖా మంత్రి పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.. విద్యార్థులకు యూనిఫామ్స్, కిట్స్, పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటు తదితర అంశాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.అలాగే విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రతి ఏడాది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహించడం జరుగుతోందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని, లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈవో శామ్యూల్ పాల్, వెల్దుర్తి తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, హెడ్ మాస్టర్ చంద్రావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ రాజేష్, జడ్పీటిసి సుంకన్న, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


