‘ పది ‘ ని ప్రశాంతంగా నిర్వహిద్దాం….అన్ని ఏర్పాట్లు చేశాం
1 min read

పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశాం అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల అంశం పై కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుండి రాష్ట్రమంతటా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో 37 వేల 331 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. 160 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి డిపార్ట్‌మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించి వారికి తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలకు ఎస్కార్ట్ సౌకర్యం, వాహనాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక కేంద్రాల్లో సిసిటివి కెమెరాల నిఘా ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమీపంలోని జిరాక్స్ షాపులు మరియు ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయబడతాయన్నారు. పరీక్షల సమయంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నాం అన్నారు. వేసవి కాలం దృష్ట్యా అన్ని కేంద్రాల్లో ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, త్రాగునీటి సౌకర్యం, ముఖ్యమైన మందులు మరియు మెడికల్ స్టాఫ్ పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంటారన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని 160 కేంద్రాలలో తగినంత ఫర్నిచర్ మరియు తాగునీటి సదుపాయం కల్పించారన్నారు. విద్యార్థులు మరియు సిబ్బంది కోసం ఏపీఎస్‌ఆర్‌టిసి ద్వారా ప్రత్యేక బస్సులు మరియు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందన్నారు. ప్రశ్న పత్రాలను 34 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామన్నారు. వీటిని పరీక్ష రోజు ఉదయం 8:00 గంటలకు తెరిచి, 8:30 కి కేంద్రాలకు చేరుస్తారన్నారు. పరీక్ష కేంద్రాల్లో తగినంత గాలి మరియు వెలుతురు ఉండేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదన్నారు. ఎలెక్ట్రానిక్ పరికరాలు ఏవీ అనుమతించబడవన్నారు.ఇన్విజిలేటర్లకు కూడా పరీక్ష కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతించడం లేదన్నారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.
ఆల్ ది బెస్ట్
పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కలెక్టర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ కోరారు. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రం చేరుకోవాలని సూచించారు.అందువల్ల ఒత్తిడి ఉండదని సూచించారు.

