జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు
1 min read

రహదారి ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు
జాతీయ రహదారిపై ఆక్రమణలు, అనధికార కట్టడాలు తొలగించాలి
బస్సులు వంటి భారీ వాహనాల ఫిట్నెస్ పరిశీలించాలి
బస్సులలో అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా ఏర్పాట్లు ఉండాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ, దెందులూరు ఎమ్మెల్యే తో కలిసి అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్ష సమావేశం అయ్యారు.జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా సంభవించే (బ్లాక్ స్పాట్స్) ప్రదేశాలలో ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లతో కలిసి రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వాహనం ఫిట్నెస్ తో ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ మాత్రమే వాహనం నడిపేలా చూడాలని, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాతీయ రహదారిపై పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు, డ్రైవర్, యజమానులపై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై అనధికార కట్టడాలు, ఆక్రమణల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని గుర్తించి వెంటనే తొలగించాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేయడంతోపాటు, వాహన యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రమాద సమయంలో క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనాలు సిద్ధంగా ఉండేలా 108 వాహనాల సిబ్బందితో సమన్వయము చేసుకోవాలన్నారు. జాతీయ రహదారి నిర్వహణ పనులను సంబంధిత కాంట్రాక్టు ఏజెన్సీ వారి పట్టించుకోవడంలేదని , జాతీయ రహదారి నిర్వహణ పనులు సక్రమంగా సాగేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.ఉప రవాణా కమీషనర్ కరీమ్ మాట్లాడుతూ రహదారి ప్రమాదం కారణంగా క్షతగాత్రులకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆసుపత్రులలో రూ. 1. 50 ల వరకు కాష్ లెస్ ట్రీట్మెంట్ కు అవకాశం ఉందని,ప్రమాదం జరిగిన 72 గంటలలోగా తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు.సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ రమేష్, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, డిఎంహెచ్ఓ డా. శోభా, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, జిల్లా పరిశ్రమల శాఖాధికారి వెంకటరావు, జాతీయ రహదారి సంస్థ అధికారులు, పోలీసు, రవాణా శాఖాధికారులు పాల్గొన్నారు.


