పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆల్ ది బెస్ట్
1 min read

– చిప్పగిరిలో సరస్వతి దేవి పూజా మహోత్సవం ఘనంగా
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవి పూజా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరై సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు మంచి స్థాయిలో ఉండాలంటే క్రమశిక్షణతో చదువుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. త్వరలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక కీలక దశ అని పేర్కొన్నారు. 2026 మార్చి 16 సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి ధైర్యంగా, నమ్మకంతో పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.పరీక్షల ముందు భయపడకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలని, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆలూరు నియోజకవర్గం విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మరియు నియోజకవర్గానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ పదవ తరగతి విద్యార్థులందరికీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హృదయపూర్వకంగా “ఆల్ ది బెస్ట్” తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

