టిడిపి కార్యాలయంలో ప్రజాధర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుండి తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే శ్యాం కుమార్ కు నేరుగా వినతి పత్రాలను అందజేశారు. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పెన్షన్లు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ, విద్యుత్, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ మేరకు ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ప్రజలకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలను తెలుసుకోవడమే ప్రజాదర్బార్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల సంబంధిత అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కే సాంబశివరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు పర్ల శ్రీనివాసులు , కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

