ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి పార్థివ దేహాలను సందర్శించిన ఎమ్మెల్యే
1 min read

కుటుంబ సభ్యులను ఓదార్చి, ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేత
కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు ఎఫ్‌సిఐ గోదాముల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన స్థానిక బిడి కాలనీకి చెందిన బొంతు దుర్గాప్రసాద్, షేక్ అహ్మద్, చిట్టి ఆంజనేయులు భౌతిక కాయాలను టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు. ఏలూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద ఉంచిన వారి మృతదేహాలకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఇదేసమయంలో అక్కడ గుండెలవిసేలా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ముగ్గురి కుటుంబాల సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే చంటి వారిని ఓదార్చారు. వారి కుటుంబాల వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే బడేటి చంటి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించడమే కాకుండా తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10వేల రూపాయలను అందించి, వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

