కండ్రికగూడెం ప్రాథమిక పాఠశాలలో ముస్తాబు కార్యక్రమం
1 min read

ఆహ్లాదకర వాతావరణమే ఆరోగ్యకర పరిస్థితులకు పటిష్ట
ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆహ్లాదకర వాతావరణమే ఆరోగ్యకర పరిస్థితులకు పటిష్ట బాటలు వేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్ధులకు సూచించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కూటమి ప్రభుత్వం విద్యార్ధుల కోసం అనేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోందన్న ఆయన వాటన్నింటినీ విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటూ పాఠశాల విద్యను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపడుతూ వస్తున్నారు. దీనిలో భాగంగానే సరికొత్త పంథాలో పయనిస్తూనే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని పేరే ముస్తాబు. ఈ కార్యక్రమం ద్వారా ఏకకాలంలో పాఠశాలల్లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలకు పెద్దపీట వేసేలా కార్యాచరణను రూపొందించారు. ఇదేక్రమంలో ఏలూరు 28వ డివిజన్ ఖండ్రికగూడెంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ముస్తాబు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తోన్న సౌకర్యాలు సక్రమంగా అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించిన ఎమ్మెల్యే చంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచేందుకు తమవంతుగా విద్యార్ధులు కృషిచేయాలని హితవు పలికారు. ఇదేసమయంలో విద్యార్దులతో మమేకమైన ఆయన వారితో మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ భాను ప్రతాప్, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్, కో- ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కో- క్లస్టర్ ఇంచార్జ్ ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

