ప్రకృతి వ్యవసాయమే రేపటి మార్గం…
1 min read

ప్రకృతి వ్యవసాయం జిల్లా డిపిఎమ్ బి.వెంకటేష్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడెం గ్రామంలో నూతనంగా ఎంపికైన 47 ట్రెయినీ ఐసీఆర్పీలకు (T-ICRPs) గురువారం ప్రకృతి వ్యవసాయం జిల్లా డిపిఎమ్ బి. వెంకటేష్ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న (ఎనీ టైమ్ మనీ) మోడల్ క్షేత్రాన్ని, అలాగే 10 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుతో పాటు 18 రకాల కూరగాయల అంతర పంటలతో సాగు చేస్తున్న పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం జిల్లా డిపిఎమ్ బి. వెంకటేష్ మాట్లాడుతూ ఏటీఎం మోడల్ ద్వారా తీగజాతి, దుంపజాతి, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు తదితర 25కి పైగా రకాల పంటలను ఏడాది పొడవునా సాగు చేసి నిరంతర కోతలు సాధించవచ్చని వివరించారు. ఈ మోడల్ ద్వారా ఇంటి అవసరాలకు ఆరోగ్యకరమైన కూరగాయలు లభించడమే కాకుండా, రోజుకు రూ.350 నుంచి రూ.400 వరకు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. . అలాగే డ్రాగన్ ఫ్రూట్ పంటలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, కషాయాలు–ద్రావణాల వినియోగం, పంట నిర్వహణ విధానాలపై అవగాహన కల్పించగా, క్షేత్రస్థాయిలో కనిపించిన ఫలితాలను చూసిన ఐసీఆర్పీలు, ప్రకృతి వ్యవసాయ రైతులను ఎంతో మెచ్చుకొని ఈ విధానం స్థిరమైన ఆదాయానికి, ఆరోగ్యకరమైన ఆహారానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.


