పత్తికొండ నుండి విజయవాడ, శ్రీశైలంకు కొత్త సర్వీసు బస్సులను నడపాలి
1 min read

ఆర్టీసీ ఎండి కి యువ స్పందన వినతి!
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ డిపో నుండి విజయవాడ మరియు శ్రీశైలానికి కొత్త సర్వీసు బస్సులను నడపాలని యువ స్పందన సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు ఆర్టీసీ ఎండి సిహెచ్ తిరుమలరావును కోరారు. బుధవారం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావును యువ స్పందన సొసైటీ బృందం కలిసి కొత్తగా విజయవాడకు, శ్రీశైలం కు కొత్త సర్వీసు బస్సులను నడపాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్తికొండ డివిజన్ ప్రాంతం చుట్టుపక్కల నుండి విజయవాడ, శ్రీశైలానికి చాలామంది ప్రజలు, విద్యార్థులు, కూలీలు వెళ్లి వస్తుంటారని తెలిపారు. అలాగే కడప, బ్రహ్మంగారి మఠం ప్రాంతాలకు భక్తులు వెళ్లి వస్తున్నారని అన్నారు. పత్తికొండ డిపో నుండి సుదూర ప్రాంతాలకు బస్సులు లేనందువలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పత్తికొండ డిపో నుండి పాత బస్సులను నడపడం వల్ల డ్రైవర్, కండక్టర్ తో పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పత్తికొండ నుండి విజయవాడ, శ్రీశైలం మరియు బ్రహ్మంగారిమఠం శ్రీశైలం ప్రాంతాలకు కొత్త సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ సభ్యులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

