విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి…. డాక్టర్. శంకర్ శర్మ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న బాష్యం పాఠశాలలో ఫ్రెషర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఫ్రెషర్స్ డే అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం అన్నారు. నిజంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం అంటే నిశబ్దంగా ఉండడం అని తెలిపారు. విద్యార్థులు ఏకాగ్రతతో పెద్దవారు,ఉపాధ్యాయులు చెప్పే విషయాలు వినాలన్నారు. విద్యార్థి దశలో తాను బాగా చదువు కోవడంతో నేడు ఉన్నతస్థానంలో ఉన్నానని అప్పుడు పరిస్థితులు ఎంతో కష్టంగా ఉండేదని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. తమ పిల్లలు మంచి స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని మంచి పాఠశాలలో చదివిస్తున్నారని డాక్టర్ తెలిపారు. ఎవరైతే విద్యార్థి దశలోనే కష్టపడి చదువుకుంటారో వారే భవిష్యత్తులో ఉన్నతస్థానంలో ఉంటారన్నారు. చదువుతో పాటు మంచి ఆరోగ్యం కోసం కురగాయలు,పండ్లు తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. ప్రతి రోజు వ్యాయామం, క్రీడలతో పాటు కొంత సమయం నిశబ్దంగా ఉంటే ఏకాగ్రత పెరుగుతుందన్నారు.ఈకార్యక్రమంలో బాష్యం పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

