పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పనులపై ఎస్వీ మోహన్ రెడ్డి పరిశీలన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పోతిరెడ్డిపాడు సమీపంలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు) పనులను వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ ఎస్.వి. మోహన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, పనులు ఎందుకు నిలిచిపోయాయో సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా నిలిచిపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.ఎత్తిపోతల పథకం పూర్తి అయితే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల రైతులకు శాశ్వత సాగునీటి భద్రత లభిస్తుందని, లక్షలాది ఎకరాలకు నీరు అందే అవకాశముందని తెలిపారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత నిధుల విడుదల లేకపోవడం, పనుల పర్యవేక్షణ లోపించడం వల్ల ఈ కీలక ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయిందని విమర్శించారు.రాయలసీమ ప్రజల హక్కైన సాగునీటిని విస్మరించడం అన్యాయమని, వెంటనే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పనులను పునఃప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి రాయలసీమకు నీటి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

