యువతకు ఆదర్శం స్వామి వివేకానంద!
1 min read

-వందకు పైగా సామాజిక సేవా కార్యక్రమాలు
-ఘనంగా యువ స్పందన పదవ వార్షికోత్సవం
పత్తికొండ, న్యూస్ నేడు: యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్న నానుడితో ఆ యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందడుగు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాఠశాల నుండి కళాశాల వరకు అందరి మిత్రులను కలుపుకొని ఒక యువ స్పందన సొసైటీ(ఎన్జీవో) ఏర్పాటు చేసుకొని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పూర్వ విద్యార్థుల సహకారంతో నిరుద్యోగుల కోసం స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయడమే కాకుండా విద్య, వైద్యం, పర్యావరణ, ఆటల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్నారు పత్తికొండ యువ స్పందన సొసైటీ. జనవరి 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 2016 సంవత్సరంలో ప్రారంభించిన యువ స్పందన సొసైటీ ప్రతి సంవత్సరం వినూత్న పద్ధతిలో వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ నేటితో 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పత్తికొండ పట్టణంలో సాయిబాబా దేవాలయంలోని స్వామి వివేకానంద విగ్రహానికి సొసైటీ ఉపాధ్యక్షులు లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు పూలమాలలు వేశారు. అనంతరం హోసూర్ రహదారిలోని రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ (ఆర్టీడీఎస్) వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యువ స్పందన సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మిత్రులతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు మరియు పత్తికొండ ప్రజల సహకారంతో ముందుకు వెళుతుందన్నారు. అందరి సహకారంతో మున్ముందు ఇలాగే ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గిరీష్, నరేష్, ఇస్మాయిల్, రాజేష్, అమరేష్, రాము, నాగభూషణం సురేష్, ఉపాధ్యాయులు మారుతి,ప్రభాకర్,చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

