NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర  సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకం

1 min read

చెత్త రహిత నంద్యాల దిశగా సమగ్ర చర్యలు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్ లక్ష్యం

తడి–పొడి చెత్త వేరు చేయడం తప్పనిసరి

జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్​ నేడు: స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర  కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల చురుకైన భాగస్వామ్యం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.  శనివారం నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన “స్వర్ణఆంధ్ర–స్వచ్ఛఆంధ్ర” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాన్ని గత ఏడాది జనవరిలో ప్రారంభించి, ప్రతి నెల మూడవ శనివారం ప్రత్యేక థీమ్‌తో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యమన్నారు. ఇంటింటి చెత్తను రోడ్లు, కాలువల్లో వేయకుండా, చెత్త సేకరణ వాహనాలు వచ్చిన సమయంలో తడి, పొడి చెత్తను వేరు చేసి అందజేయాలని ప్రజలకు సూచించారు. డంపర్ బిన్స్ ఉన్నప్పటికీ వాటి చుట్టూ చెత్త వేయడం వల్ల పర్యావరణానికి, మూగజీవులకు హాని కలుగుతుందని పేర్కొన్నారు. తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చడం, పొడి చెత్తను వేరుగా సేకరించడం ద్వారా ఆదాయ వనరులుగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. ప్రమాదకర వ్యర్థాలను మాత్రం తప్పనిసరిగా సంబంధిత సిబ్బందికే అప్పగించాలని స్పష్టం చేశారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నంద్యాల పట్టణానికి మెరుగైన ర్యాంకు సాధించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీల నిర్వహణ, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత, వాటి వినియోగంపై ప్రజల అభిప్రాయాలను సేకరించి సేవలను మెరుగుపరచాలని సూచించారు.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పరిశుభ్రత ఒక నిరంతర ప్రక్రియ అని, దీని కోసం క్రమమైన పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. నంద్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *