దేవాదాయశాఖ ప్రామాణిక నిర్వహణ విధానాల ప్రకారం దేవాలయాలను నిర్వహించాలి
1 min read

దేవాలయాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలను మెరుగుపర్చాలి
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
కర్నూలు , న్యూస్ నేడు : దేవాదాయ శాఖకు ప్రామాణిక నిర్వహణ విధానాలు వేదమంత్రాలతో సమానమని, ఆ మేరకు దేవాలయాలను నిర్వహించి శాఖ అభివృద్ధికి కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం కర్నూలు లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కర్నూలు, నంద్యాల జిల్లాల దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…భక్తుల నుండి ఫిర్యాదులు రాకుండా దేవాలయాల్లో సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అర్చకులకు,వేదపండితులకు, ధూప, దీప, నైవేద్యాలకు, మరమ్మత్తులకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విధానాలపై ప్రజల నుండి హర్షం వ్యక్తం అవుతోందన్నారు. దేవాలయ పునర్నిర్మాణ పనులు, అసంపూర్ణంగా మిగిలిపోయిన నిర్మాణాల మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దేవాలయాల ఆదాయ వనరులను,ఆస్తులను పరిరక్షించే చర్యలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. దేవాలయ ప్రాంగణాలలో చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని, పారిశుద్ధ్య చర్యల్లో లోపాలు లేకుండా సమర్థవంతంగా చేయాలని మంత్రి ఆదేశించారు. శ్రీవాణి నిధుల ద్వారా దేవాలయాల నిర్మాణం కోసం తగిన ప్రతిపాదనలు పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ , కమిషనర్ రామచంద్ర మోహన్ లు మాట్లాడుతూ…దేవాలయాల్లో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, సేవలు, ప్రసాదంలో నాణ్యత, పారిశుద్యం తదితర అంశాల్లో ప్రజల నుండి సానుకూల స్పందన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, పండుగ రోజుకు, విశిష్ట దినాలలో దేవాలయాలను చక్కగా అలంకరించాలని సూచించారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహార్ లాల్ , కమిషనర్ రామచంద్ర మోహన్ , రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్ , డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్, సూపరిండెంట్ ఇంజనీర్ సతీష్ , అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్ది , మద్దిలేటి స్వామి ఈవో రామాంజనేయులు , మహానంది , ఉరుకుందు ఈరన్న తదితర దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు,ఇంజనీర్లు తదితరులు హాజరయ్యారు.


