NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్షుద్ర పూజల కలకలం…

1 min read

హోళగుందలో భయాందోళనలు, నిందితులపై కఠిన చర్యల డిమాండ్

మానసిక క్షోభలో బాధితులు… పోలీసులకు ఫిర్యాదు

హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో క్షుద్ర పూజల ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 3వ తేదీన స్థానిక సాయిబన్న దర్గా వెనుకభాగంలో 23 మంది వ్యక్తుల ఫోటోలు ఉంచి క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనపై బాధితులు వెంటనే స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం బాధితులు పత్రికా సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమపై కక్ష సాధింపునకు ఈ విధంగా క్షుద్ర పూజలు నిర్వహించడం దారుణమని, ఈ చర్యలు తమ కుటుంబ సభ్యులపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతున్నాయని వారు తెలిపారు. కొంతమంది కుటుంబ సభ్యులు భయంతో, ఆందోళనతో మానసికంగా కృంగిపోతుండగా, మరికొందరు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న మొహమ్మద్ మరియు వజీర్ అనే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని కోరారు. అంతేకాకుండా, గ్రామ శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని గ్రామ బహిష్కరణ చేయాలని కూడా డిమాండ్ చేశారు.గ్రామ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని, ఇది సామాజికంగా కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని బాధితులు తెలిపారు. ప్రజల్లో భయం, అనుమానాలు పెరిగేలా ఈ ఘటన ప్రభావం చూపుతోందని వారు పేర్కొన్నారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీకి త్వరలో అర్జీ రూపంలో వినతి పత్రం అందజేసి న్యాయం కోరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ పత్రికా సమావేశంలో బాధితులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని, ఇటువంటి సంఘటనలు మళ్లీ చోటుచేసుకోకుండా కట్టడి చేయాలని వారు అధికారులను కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *