ఉద్యోగ కార్మికుల స్వేచ్ఛా పతాక సిఐటియు ఎర్రజెండా ఎస్.ఎ. చిన్న రహిమాన్
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: పని గంటల మహత్తర పోరాటంలో ఆవిర్భవించిన శ్రమజీవుల స్వేచ్ఛా పతాక సిఐటియు ఎర్రజెండా అని సిఐటియ ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహిమాన్ సిఐటియు సహాయ కార్యదర్శి పద్మశాలి. శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్. హుసేన్, వడ్డే.శ్రీనివాసులు అన్నారు.సిఐటియు అఖిలభారత మహాసభల సందర్భంగా కేంద్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక జలదుర్గం గ్రామంలో సిఐటియు జెండాను ఎస్ .ఎ. చిన్న రహిమాన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిత్యం ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నది.కార్మిక హక్కులు,సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల తో పాటు దేశీయ పరిశ్రమల రక్షణ స్వావలంబన కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నది. సంస్కరణల పేరిట ప్రజలపై పడుతున్న భారాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నది. స్కీం వర్కర్లు ఇతర అసంఘటితరంగ కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న ఆందోళన పోరాటాలకు అండగా నిలుస్తున్నది.ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి తోడ్పాటును అందిస్తున్నది.ఉద్యోగ కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నది.అయితే కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా కార్మిక హక్కులపై దాడి చేస్తున్నది.కార్మిక వర్గం ప్రాణత్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం యాజమాన్యాలకు ప్రయోజనాలు కల్పించే విధంగా 4 లేబర్ కోడ్స్ గా చట్టాలను మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నది. దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అదాని అంబానీల పరం చేయడానికి తహతహలాడుతున్నది. అందుకే కార్మిక హక్కులు కాల రాసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది.సిఐటియు ఏర్పడిన 55 సంవత్సరాల కాలంలో ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారం కోసం హక్కులు సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించి పలు విజయాలను సాధించింది. సిఐటియు ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సిఐటియు అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టింది.ఈ మహాసభలకు దేశంలోని 29 రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక ప్రతినిధులు, పరిశీలకుల తో పాటు పలు దేశాల నుండి సౌహార్ధ ప్రతినిధులు హాజరు అవుతున్నారు.

