దేవాలయాల భూముల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టాలి
1 min read

జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్
నంద్యాల, న్యూస్ నేడు: దేవాలయాలకు చెందిన భూములు ఎలాంటి అక్రమాలకు గురికాకుండా సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఆర్డీఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో దేవాలయ భూముల పరిరక్షణ అంశంపై జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, బనగానపల్లె/డోన్ ఆర్డీఓ నరసింహులు, ఆత్మకూరు ఆర్డీఓ శివనాగజ్యోతి, దేవాదాయ శాఖ అధికారి మోహన్, జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయ భూముల పరిరక్షణ బాధ్యత సంబంధిత కార్యనిర్వహణాధికారులపై ఉందన్నారు. రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో దేవాదాయ శాఖ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొని దేవాలయాల పేర్లు సక్రమంగా నమోదు చేయించుకోవాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా దేవాలయ భూములు అక్రమ ఆక్రమణకు గురైనట్లయితే వెంటనే వాటిని గుర్తించి, తదుపరి సమావేశంలో చర్చించి ఆక్రమణదారులను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల పేర్లను ఆన్లైన్‌లో మ్యూటేషన్ చేయించే విధంగా సంబంధిత మండల తహశీల్దార్లకు సూచనలు జారీ చేయాలని ఆర్డీఓలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

