NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షుగ‌ర్ ఫ్యాక్టరీల బ‌కాయిలు చెల్లించేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నాం..

1 min read

రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

శాస‌న‌మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు స‌మాధాన‌మిచ్చిన మంత్రి 

కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్రంలోని షుగ‌ర్ ఫ్యాక్టరీల‌ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుంద‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. శాస‌న‌మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్రశ్నకు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 29 షుగర్ ఫ్యాక్టరీలు ఉండ‌గా అందులో 10 కోఆప‌రేటివ్ సొసైటీ కింద‌, మ‌రో 19 ప్రైవేటువ‌న్నారు. ఫ్యాక్టరీల మూసివేత‌కు ప్రధానంగా వారి రేటింగ్ సామ‌ర్ధ్యాల‌కు త‌గినంత చెర‌కు అందుబాటులో లేక‌పోవడం, లేబ‌ర్ కాస్ట్ పెరిగిపోవ‌డం, భారీగా పెరిగిపోయిన న‌ష్టాల వ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి బ‌ల‌హీన‌మైపోవ‌డం, చెక్కెర అమ్మక‌పు ధ‌ర‌తో పోల్చితే ఉత్పత్తికి అయ్యే ఖ‌ర్చు ఎక్కువ అవ్వ‌డ‌మ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. 19 ప్రైవేటు ఫ్యాక్టరీల‌లో 4 రన్నింగ్‌లో ఉన్నాయ‌న్నారు. కోఆప‌రేటివ్ సొసైటీ కింద ఉన్న 10 ఫ్యాక్టరీలలో 1 మాత్రమే ర‌న్నింగ్‌లో ఉంద‌ని, అది కూడా గ‌త సంవ‌త్సరంలోనే అన్నారు. ఫ్యాక్టరీల‌కు సంబంధించిన బ‌కాయిల‌ను చెల్లించేందుకు ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్యలు తీసుకుంటుంద‌న్నారు. ఇప్పటికే రూ.10 కోట్ల వ‌ర‌కు బ‌కాయిలు చెల్లించామ‌న్నారు. ఇక కార్మిక స‌మ‌స్యల‌ను అధిగ‌మించేందుకు, వ్యవ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎస్.ఎం.ఏ.ఎం ప‌థ‌కం ద్వారా స‌బ్సిడీ ఆధారంగా వ్యవ‌సాయ ప‌నిముట్లు స‌ర‌ఫ‌రా చేయ‌డం, చెక్కెర‌పై వ్యాట్ మ‌రియు సి.ఎస్.టిని ర‌ద్దు చేయ‌డం ద్వారా రాష్ట్రంలో చెర‌కు సాగుదారుల‌కు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మ‌ద్దతు ఇస్తుంద‌న్నారు.

About Author