మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. డీఎస్సీ పోస్టుల భర్తీపై మంత్రి టి.జి భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించామని, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్య రంగాన్ని దేశంలోనే తొలి స్థానంలో నిలబెడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్య్లూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇచ్చి వారికీ అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. అయితే యువత బాగుపడటం ఇష్టంలేని ప్రతిపక్ష నేత మెగా డీఎస్సీని ఆపేందుకు 24 కేసులు వేయించాడన్నారు. అవన్నీ తట్టుకొని మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ఘనత మంత్రి నారా లోకేష్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14 నెలలుగా సమర్ధవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ బడులకు నూతన వెలుగులు తెస్తున్నామన్నారు. 2014-2019 మధ్య 2 డీఎస్సీలు జరిపి 18వేల ఉపాధ్యాయ పోస్టులను తెలుగుదేశం ప్రభుత్వం భర్తీ చేసిందని మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాలీగా ఉన్న 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించిందని, 700 కోయభారతి టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేశామని, 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ చేశామన్నారు. టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేందుకు గత ప్రభుత్వంలో ఆరు రకాల బడుల విధానం ఉండగా.. తమ కూటమి ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల బడులుగా మార్చిందన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.

