అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి…
1 min read
నగరపాలక యంత్రాంగానికి కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశం
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో, నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస ఏర్పాట్ల చర్యలు చేపట్టాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండి, తమ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. బుధవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అధికారులకు, సచివాలయ సిబ్బందికి కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నెంబర్ 08518221847 లేదా 7422992299 లకు కాల్ చేయాలని కోరారు. ఈ అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నగరపాలక సంస్థ అధికారుల, సిబ్బంది సెలవులు అన్ని రద్దు చేస్తున్నట్లు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

