ఉద్యోగాల పేరున యువతకు గాలం.. డబ్బు వసూళ్లు..
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలంలో ఒక వ్యక్తి ఉద్యోగాల పేరున యువతకు గాలం వేసి.. డబ్బు వసూళ్లు చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మహానందికి చెందిన ఆ వ్యక్తి తిమ్మాపురం, మహానంది, ఎం సి ఫారం, సిరివెళ్ల మండలంలోని కోటకొండ, బండి ఆత్మకూరు మండలంలోని ఈర్నపాడు తదితర గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అందిన కాడికి డబ్బులు వసూలు చేసుకుని పరార్ అయినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పలువురు నిరుద్యోగులు ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు చెల్లించి మోసపోయినట్లు సమాచారం. ఉద్యోగాల కోసం యువత తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడంతో అప్పులు చేసి తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశలతో కేటుగానికి డబ్బులు చెల్లించి మోసపోయామని గ్రహించి బయటికి చెప్పుకోలేక, అప్పుల వాళ్ళకు అప్పులు చెల్లించలేక తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరికి మాత్రం కొంత డబ్బులు చెల్లించిన కేటుగాడు మిగతా వారికి పంగనామాలు పెట్టి తిరుపతిలో రహస్యంగా ఒక వైద్యశాలలో పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో నంద్యాలలోని ఒక మెడికల్ స్టోర్ నందు పనిచేస్తూ ప్రభుత్వ వైద్యశాలలనందు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను ప్రలోభ పెట్టి డబ్బులు వసూలు చేసుకుని పరారై తిరుపతిలో మకాం పెట్టినట్లు తెలుస్తుంది. దీనిని గుర్తించి మోసపోయిన యువత మహానంది మండలంలోని ఆ కేటుగాడు పెళ్లి చేసుకున్న గ్రామంలో కూడా అతగాడి కోసం అన్వేషణ చేసిన ఆశించిన ఫలితం వారికి దక్కలేదని తెలిసింది. ఆ కేటుగాడి సోదరుడిని కూడా పలుమార్లు కలిసినా స్పందన లేదని నిరుద్యోగ యువకులు ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరికి ఒత్తిడి చేయడంతో బాండ్లు మరియు చెక్కులు రాసి ఇచ్చినట్లు సమాచారం. చెక్కులు తీసుకొని బ్యాంకు వద్దకు వెళ్లగా ఖాతాలో నగదు నిల్వలు లేవని బ్యాంకు అధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ కేటుగాడి వలలో ఎంతమంది నిరుద్యోగ యువకులు మోసపోయారు అనేది బహిర్గతం కావలసి ఉంది.

