NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పక్కా ఆధారాలతోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు

1 min read

జనసేన నేత అప్పల నాయుడు.

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై పక్కా ఆధారాలున్నప్పుడే చర్య తీసుకున్నట్లు జనసేన పార్టీ ఏలూరు ఇన్‌ఛార్జి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక జనసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ముసుగులో నేరస్తులు ప్రభుత్వాన్ని ఆక్రమించడమే కాకుండా ప్రజల అభివృద్ధికి అడ్డు తగిలారని ధ్వజమెత్తారు. “ఢిల్లీ మద్యం కుంభకోణం రూ.100 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.3500 కోట్ల స్కాం జరిగింది. ఇదే స్కాంలో మిథున్ రెడ్డి పాత్రపై పక్క ఆధారాలతోే అరెస్టు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం, ఇసుక కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిగితే ఎన్నో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయి” అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి మద్యం మాఫియాతో ఒప్పందం చేసుకుని ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. “పాత పద్ధతుల మద్యం సరఫరా వ్యవస్థను నాశనం చేసి, ప్రభుత్వ రిజర్వ్ బ్రాండ్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. ఈ డబ్బుతోనే గత ఎన్నికల్లో ఒక్కో జిల్లాలో 400 కోట్ల చొప్పున ఖర్చు పెట్టారు” అని పేర్కొన్నారు. ఇసుక స్కాంపై ఈడీ దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. “ఇసుక లాభాలను మాఫియాలకు అప్పగించి వేల కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి వచ్చిన హాని మాటలతో మాయచేయలేరు” అని స్పష్టం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని, దాన్ని ఓర్పుకోలేక వైసీపీ నేతలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాదులో కూర్చొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. “వారే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేశారు? దానిపై చర్చకు సిద్ధం. తాము చేస్తున్న దుష్ప్రచారం ప్రజల పట్ల అసభ్య సంస్కృతి రుద్దాలన్న కుట్రలో భాగం” అని అన్నారు. రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించి, అల్లర్లు రేపాలన్న, వైసీపీ నేతల కుట్రలకు తాము భయపడబోమని హెచ్చరించారు. శాంతిని భగ్నం చేసే ప్రయత్నాలను అణచివేస్తామని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నేతలు రెడ్డి గౌరీ శంకర్, వీరంకిపండు, నగి రెడ్డి కాశీ నరేష్, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి, జనపరెడ్డి తేజ ప్రవీణ్, కొండేటి రమేష్, మల్లెమొగ్గల బాలాజీ, అచ్యుత్ నాని, వీర మహిళలు కొసనం ప్రమీల, కూన అనసూయ, యడ్లపల్లి మమత, దుర్గా బీబీ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరితంగా సాగింది.

About Author