పదేళ్ల బాలుడికి అరుదైన క్లోమ సమస్య…
1 min read

పాంక్రియాస్లో ఎక్కువ సంఖ్యలో రాళ్లు
వాటివల్ల ఉబ్బిపోయిన పాంక్రియాస్ పైపు
ఫ్రేస్ ప్రొసీజర్తో సమస్య తగ్గించిన కిమ్స్ వైద్యులు
కర్నూలు, న్యూస్ నేడు : పిల్లల్లో చాలా అరుదుగా కనిపించే సమస్య.. క్రానిక్ కాల్సిఫిక్ పాంక్రియాటైటిస్. అంటే దీర్ఘకాలం పాటు క్లోమంలో రాళ్లు ఏర్పడడం. ఇది దక్షిణ భారతదేశంలో ప్రతి లక్ష మంది పిల్లల్లో 126 మందికి మాత్రమే, అంటే 0.126% మందికే వస్తుంది. ఇలాంటి అరుదైన సమస్య కారణంగా తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్న రితిక్ అనే పదేళ్ల బాలుడికి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యనపుణులు ఫ్రేస్ ప్రొసీజర్ అనే శస్త్రచికిత్స చేసి సమస్యను పరిష్కరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎస్.జె. జానకిరామ్, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఎం.శ్రీకాంతబాబు మీడియాకు తెలిపారు. ఇక్కడ ముందుగా బాబుకు ఎంఆర్ఐ పరీక్ష చేసి, లోపల పరిస్థితి ఏంటన్నది పూర్తిగా తెలుసుకున్నాం. ఇలాంటి సమస్యకు ఫ్రేస్ ప్రొసీజర్ మాత్రమే చేయాలని నిర్ణయించాం. అయితే రోగి వయసు పది సంవత్సరాలే కావడంతో పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఎం. శ్రీకాంతబాబు సాయం కూడా తీసుకున్నాం. ఇద్దరం కలిసి ముందుగా బాలుడి పాంక్రియాస్ను తెరిచి, అందులో ఉన్న రాళ్లు అన్నింటినీ తొలగించాం. వాటితో పాటు కొంత కణజాలాన్ని (టిష్యూ) కూడా తీసేయాల్సి వచ్చింది. రాళ్లు ఏర్పడడంతో పైప్ బాగా ఉబ్బి ఉంది. ఆ రాళ్లను తొలగించిన తర్వాత అది సాధారణ స్థితికి చేరుకుంది. కొంత చిన్న పేగును కూడా అలాగే కత్తిరించి, తర్వాత ఈ రెండింటినీ కలిపి కుట్లు వేశాం. ఈ శస్త్రచికిత్స వల్ల బాలుడికి ప్రధానంగా నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ క్లోమం పనితీరు ఇంతకుముందులా సాధారణంగా ఉండదు కాబట్టి భవిష్యత్తులో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే ఏదైనా నూనె పదార్థం తిన్నప్పుడు ఆ నూనె కూడా మలంతో పాటు బొట్లుబొట్లుగా పడిపోయే అవకాశం (ఆయిల్ స్టూల్స్) ఉంటుంది. దానికి కూడా మందులు ఇచ్చాం. ఇది దీర్కాలం పాటు పెరుగుతూ ఉండే వ్యాధి. అందువల్ల దీన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. రాళ్లు పూర్తిగా తొలగించడంతో నొప్పి మాత్రం పూర్తిగా పోతుంది. ఈ విషయాలన్నింటినీ బాలుడి తల్లిదండ్రులకు వివరంగా తెలిపి, అతడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాం” అని డాక్టర్ జానకిరామ్, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఎం.శ్రీకాంతబాబు తెలిపారు. సాధారణంగా ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలకు హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లోనే చికిత్స చేయించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో కూడా అన్ని విభాగాల నిపుణులు, అత్యాధునిక సదుపాయాలు ఉండడంతో రాయలసీమ వాసులకు అనుకూలంగా ఉంది.

