అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
1 min read

RYSF రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు.
విజయవాడ , న్యూస్ నేడు :అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరమ్ (RYSF) రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు జిల్లా జాయింట్ కలెక్టర్ లలేఖ్య గారిని కోరారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈమేరకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా పదవ తరగతి పరీక్షలు పూర్తి కాలేదని,విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునిపే (శ్రీ చైతన్య,నారాయణ,యస్ ఆర్,భవిష్య,వశిష్ట,ఆన్ అకాడమీ,గోల్డెన్ ఐ ఇన్సిస్టిట్యూట్,అలెన్,శస్త్ర) లాంటి పలు విద్యాసంస్థలు విఆర్వోల ద్వారా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ముందుగా అడ్మిషన్లు తీసుకుంటే ఫీజులో రాయితీ అంటూ మభ్యపెడుతున్నారని అన్నారు.చై,నా లాంటి కొన్ని కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చారని అన్నారు.పదవ తరగతి పరీక్షలు పూర్తి కాక మునిపే ఫలితాలు రాకముందే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయపెట్టి, తొందరపెట్టి అడ్మిషన్లు చేస్తున్నారు. “సీట్లు అయిపోతాయి”, “ఇప్పుడు జాయిన్ అవ్వకపోతే మీ పిల్లవాడి భవిష్యత్తు పాడవుతుంది” అంటూ ఒత్తిడి తెచ్చి అమాయక తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, స్టేషనరీ అమ్మడం ముందస్తు తరగతులు స్పెషల్ క్లాసులు, బ్రిడ్జి కోర్సులు నిర్వహించడం జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు.విద్యార్థులకు గంటలకొద్దీ క్లాసులు పెట్టి, మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని ,కొంతమంది విద్యార్థులు ఈ ఒత్తిడిని భరించలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని,బలవన్మరణాలకు పాల్పడుతున్నా చర్యలు లేవని,పేద మరియు మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లల చదువు కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నా కానీ ఇలాంటి అక్రమాలు వారి ఆశలను నాశనం చేస్తున్నాయి అన్నారు.ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా తీసుకువచ్చిన జీవో నెంబర్ ఎంఎస్ 9 ప్రకారం బహిరంగంగా ర్యాంకులు విద్యార్థుల ఫోటోలు ప్రకటించకుండా సెలవు సమయంలో తరగతులు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యాసంస్థలపై పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో RYSF నాయకులు పడమట నరేష్,రేమల్లి రవీంద్ర బాబు పాల్గొన్నారు.

