తైక్వాండోలో క్రీడాకారులు రాణించాలి.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని ఏ.క్యాంపు సమీపంలోని శిక్షణ కేంద్రంలో తైక్వాండో కోచ్ జి.షబ్బీర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు మంత్రి టీజీ భరత్ బెల్ట్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద నగరాల్లో వేలు, లక్షల్లో కోచింగ్ కోసం డబ్బులు తీసుకుంటారన్నారు. మనకు తక్కువ ఖర్చుకే ఇలాంటి క్రీడల్లో శిక్షణ లభిస్తుందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. క్రీడాకారులు కూడా బెల్ట్స్ సాధించామని అంతటితో ఆగిపోకుండా మరింత కష్టపడాలన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కోటాలో కూడా అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో వ్యాయామం ఎంతో అవసరమన్నారు. పుస్తకాలతోనే కుస్తీ పట్టకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇక ఇటీవలె ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనకు వచ్చి కర్నూలు పేరును దేశ, ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశారన్నారు. రానున్న రోజుల్లో కర్నూలుకు భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. యువతకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ షబ్బీర్, కార్పొరేటర్ కైప పద్మలతా రెడ్డి, నాయకులు చంద్రమోహన్, వినోద్ చౌదరి, శేఖర్, ప్రమోద్, రామకృష్ణ, అనిల్, మల్లికార్జున గౌడ్, వెంకటేష్, నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, కార్డియాలజిస్టు ఇందుప్రకాశ్, స్కూల్ గేమ్స్ సెక్రెటరీ కృష్ణ, సీపీఐ నాయకులు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


