నందికొట్కూర్ లో దారుణం..భార్యపై పెట్రోల్ పోసి..!
1 min read

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణి..
నందికొట్కూరు , న్యూస్ నేడు: భార్యపై భర్త పెట్రోల్ పోసి అంటించిన సంఘటన నందికొట్కూరు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం మద్ది గట్ల రోడ్డులో చిన్నకోట పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న కళ్యాణి (28)పై గురువారం ఉ 11 గంటల సమయంలో ఆమె భర్త మల్లికార్జున మద్యం మత్తులో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు.వారు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం గద్వాల ప్రాంతానికి చెందిన కళ్యాణి, నందికొట్కూరుకు చెందిన మల్లికార్జునతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు.కుటుంబంలో లగ్నపత్రిక శుభ కార్యక్రమం నిర్వహిస్తున్న రోజునే ఈ ఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.మద్యం సేవించి ఇంటికి వచ్చిన మల్లికార్జున భార్యతో గొడవ పడి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.బాధితురాలి కేకలు విని అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి తీవ్ర గాయాలపాలైన కళ్యాణిని అంబులెన్స్ ద్వారా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

