చంద్రబాబు అనుభవం పేరుతో అబద్ధాలు చెబుతున్నారు
1 min read
– వైఎస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: అనుభవం పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ ఫ్లాప్ చేసిన చంద్రబాబు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించారని విమర్శించారు.దౌర్జన్యాలు, దాడులు, పోలీసుల వేధింపుల మధ్య స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేమని భావించిన టీడీపీ నేతలు నామినేషన్ల ప్రక్రియ నుంచి కౌంటింగ్ వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు.టీడీపీ నేతల ఒత్తిళ్లు, పోలీసుల వేధింపులు ఎదురైనప్పటికీ వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ధైర్యంగా ఎన్నికల బరిలో నిలిచి పోరాటం చేశారని తెలిపారు. కర్నూలులో కౌంటింగ్ కేంద్రంలో నాలుగు కార్పొరేటర్ స్థానాలను దౌర్జన్యంగా టీడీపీ లాక్కుందని, మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం జరిగిందని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు.చంద్రబాబు ఆదేశాల మేరకే ఎన్నికల కమిషన్ వ్యవహరించిందని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాంటి కుట్రలకు తావులేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని గుర్తు చేశారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.


