పెట్రోల్ లో నీళ్లు వస్తున్నాయని ఆందోళన…
1 min read

యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి.
నందికొట్కూరు , న్యూస్ నేడు : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.పట్టణంలో ఆత్మకూరు రహదారిలో పాత బస్టాండ్ లో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వాహనదారులు గురువారం నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ పెట్రోల్ విక్రయించడంతో తమ వాహనాలు మరమ్మతులకు గురై స్టార్ట్ అవ్వడంలేదని చెప్పారు. స్టార్ట్ అయినా తెల్లటి పొగ వచ్చి ఆగిపోతున్నాయన్నారు.ఈ విషయాన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే పెట్రోల్ నాణ్యతా ప్రమాణాలు సక్రమంగానే ఉన్నాయని, ఏమైనా తేడాలు ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడుకోమని చెబుతున్నారని తెలిపారు.గత సోమవారం ఒక వ్యక్తి ఇండియన్ పెట్రోల్ బంకులో రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బైక్ మోరాయించడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు.పెట్రోల్ లో నీళ్లు కలిశాయని మెకానిక్ తెలిపాడు.బంకు యాజమానిని కలిసి నిలాదీయగా రెండు లీటర్లు పెట్రోల్ ఇచ్చి పంపించినట్లు బాధితులు తెలిపారు.ఇలా ఎంతో మంది బాధితులు ఈ పెట్రోల్ బంకు లో పెట్రోల్ పోసుకొని నష్ట పోయారు. పెట్రోల్ కు బదులు నీళ్లు వచ్చాయని వాహనదారులు వాపోయారు.పెట్రోల్ కొట్టించుకొని కొంత దూరం వెళ్లాక దారి మధ్యలో బైక్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.మరమ్మతుల కోసం వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్తే అందులో పెట్రోల్ బదులు నీళ్లు ఉన్నాయని వాపోయారు.అధికారులు తనిఖీ లు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు స్పందించి పెట్రోల్ బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

