పెట్టుబడి యాప్ ల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు…
1 min read

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .
మీ డబ్బు, మీ భద్రత – జాగ్రత్తగా వ్యవహరించండి
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు, న్యూస్ నేడు: ఇటీవల “Market Master”, “HUGE”, “Share Booster”, “Quick Profit”, “Stock Wizard” వంటి పెట్టుబడి యాప్ లు, సోషల్ మీడియా, టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను సైబర్ నేరగాళ్ళు మోసం చేస్తున్న ఘటనలు జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చాయని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం తెలిపారు.అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపిస్తూ ఈ యాప్ ల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేసి అనంతరం మూసివేస్తున్నారు.
మోసం చేసే విధానం …
యాప్ ల ద్వారా ‘100% లాభం, రోజుకి 3-5% రిటర్న్స్’ వంటి వాగ్దానాలు.మొదట్లో చిన్న మొత్తాలపై లాభాలు చూపించి నమ్మకాన్ని కల్పించడం. ఆ పై పెద్ద మొత్తాలను డిపాజిట్ చేయమని ఒత్తిడి చేయడం. డబ్బు పంపిన తరువాత యాప్ లేదా వెబ్సైట్ పనిచేయకపోవడం. మోసగాళ్లు విదేశీ నంబర్లు, ఫేక్ కేవైసి డాక్యుమెంట్లు ఉపయోగించడం. జిల్లా ఎస్పీ సూచనలు: పెట్టుబడులు చేసే ముందు సంబంధిత కంపెనీ లేదా యాప్ SEBI/RBI గుర్తించిందా అనే దాని పై పరిశీలించాలి. ‘100% లాభం, నష్టమేం ఉండదు’ వంటి ప్రకటనలు మోసపూరితమవే. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సూచనలను పూర్తిగా నమ్మవద్దు. ఎటువంటి అనధికారిక లింకులు లేదా యాప్ లలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దు.
కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ “Share Booster” అనే యాప్ ద్వారా రూ. 1 లక్ష 20 వేలు పెట్టుబడి పెట్టింది. టెలిగ్రామ్ గ్రూపు ద్వారా ఒక బ్రోకర్ సూచనలతో డిపాజిట్ చేసిన తర్వాత యాప్ ఎర్రర్ చూపించడంతో మోసపోయారు. కర్నూలుకు చెందిన ఒక మహిళ “HUGE” అనే యాప్ ద్వారా రూ. 90 వేలు పెట్టుబడి పెట్టింది. స్పెషల్ ప్లాన్ ద్వారా నెల రోజుల్లో డబుల్ అవుతుందని చెప్పి డబ్బు వసూలు చేశారు. అనంతరం యాప్ మూసివేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక వేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. అదేవిధంగాwww.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.ఈ తరహా మోసాల పై అప్రమత్తంగా ఉండండి. ఇతరులకు కూడా ఈ విషయాలను తెలియజేయండి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతుంటారు, కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.

