అక్టోబర్ 7న విజయవాడలో ధర్నా: ఫ్యాప్టో
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ నందు వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు కాకి ప్రకాష్ రావు కర్నూలు జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయుటకు సన్నాహక సమావేశం కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఆర్ సేవా లాల్ నాయక్ అధ్యక్షతన ఎస్టియు భవన్ నందు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ మరియు కర్నూలు జిల్లా పరిశీలకులుకాకి ప్రకాష్ రావు , ఫ్యాప్టో జిల్లా చైర్మన్ సేవా లాల్ నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పిఆర్సి, మధ్యంతర భృతి మంజూరు, సి.పి.ఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ఇందుకు నిరసనగా విజయవాడలో భారీ ధర్నా చేపడుతున్నామని, ఉపాధ్యాయులందరూ ఐక్యంగా పోరాడి ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.

