NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే వైద్యులకు అత్యున్నత గౌరవం!

1 min read

నమ్మకాన్ని కూడా మీ విధినిర్వహణలో భాగంగా మార్చి సేవలందించండి

గిరిజన, మారుమూల ప్రాంతాల్లో సవాళ్లపై అవగాహన పెంచుకోండి

లాభాపేక్షతో కాకుండా మానవత్వంతో సేవలందించండి

మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్

మంగళగిరి , న్యూస్​ నేడు : ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో ఉంటారు. ఈ గౌరవం సంపద లేదా హోదా వల్ల కాదు.. వారు జీవితానికి, మరణానికి మధ్య నిలబడి ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే సమాజంలో ఈ గౌరవం లభిస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో నిర్వహించిన స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన, భయం, బాధ ఉంటాయి. అత్యవసర వార్డులోకి ప్రవేశించే రోగి మీ కళ్లలోకి ఆర్తిగా చూస్తాడు. అప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి: వారు మీ నుంచి నమ్మకం లేదా ప్రేమను కోరుకుంటున్న విషయాన్ని గమనించాలి. మీరు కేవలం మందులను మాత్రమే సూచించడం లేదు, మీరు వారిలో ఆశను చిగురిస్తున్నారు. కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైనప్పుడు, ప్రాణాలను కాపాడటానికి వైద్యులు ప్రమాదంలో సైతం సేవాభావంతో నడిచారు. వారు కుటుంబాలకు దూరంగా ఐసోలేషన్ వార్డులలో అవిశ్రాంతంగా పనిచేశారు. అందుకే సమాజం వైద్యులను దేవుడి తర్వాత అంతటి వారిగా భావిస్తుంది.ఈ కార్యక్రమంలో కేంద్ర, ఆరోగ్య, రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, మంగళగిరి ఎయిమ్స్ అధ్యక్షులు మేజర్ జనరల్ డాక్టర్ తపన్ కుమార్ సాహా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అంతం శాంత సింగ్, విశిష్ట అధ్యాపక సభ్యులు, పట్టభద్రులైన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author