NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు – పూర్ణాహుతి

1 min read

శ్రీశైలం, న్యూస్​ నేడు:  మహాశివరాత్రి పురస్కరించుకొని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదవరోజైన ఈ రోజు ( 17.02.2026) ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత శ్రీ స్వామివారి యాగశాల యందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి.రుద్రహోమం, చండీహోమం జరిపించడ్డాయి.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూలస్నానం, కార్యక్రమాలు జరిపించబడ్డాయి.పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది.అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి  ఆలయపుష్కరిణి వద్ద ఆగమశాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించబడింది. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ పూర్ణాహుతి కార్యక్రమములో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి  శ్రీ యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, అధ్యాపక (స్థానాచార్యులు) వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.

ధ్వజావరోహణ: ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ( 17.02.2026) సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేయబడుతుంది.

సదస్యం – నాగవల్లి: మహాశివరాత్రిబ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈ రోజు( 17.02.2026) నిత్య కల్యాణమండపంలో  సదస్యం మరియు నాగవల్లి కార్యక్రమాలు జరిపించబడుతాయి. సదస్యం కార్యక్రమంలో  వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్త్రోత్రాలతో శ్రీస్వామిఅమ్మవార్లను స్తుతిస్తారు.ఆ తరువాత జరిగే నాగవల్లికార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించబడిన  శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు,నల్లపూసలు సమర్పించబడుతాయి.

రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో ( 17.02.2026) ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా రేపు ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడతాయి.    తరువాత రేపు సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ మరియు ఆలయ ఉత్సవం జరిపించబడుతుంది. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం జరిపించబడతాయి.

About Author